guravayanam

పేరులో ఏముంది?!


 
పేరులో ఏముంది? “వాటీజ్ ఇన్ ఎ నేమ్? దట్ విచ్ వియ్ విల్ కాల్ ఎ రోజ్ బై ఎనీ అదర్ నేమ్ – వుడ్ స్మైల్ యాజ్ స్వీట్” అని షేక్‌స్పియర్ మహానుభావుడు ఎప్పుడో, ఎక్కడో అన్నాడట. అప్పటినుంచి మనోళ్లందరూ తెగ రెచ్చిపోతుంటారు.. పేరులో ఏముంది, అంతా మనలోనూ, మనసులోనూ ఉండాలి కానీ అని!
నన్నడిగితే (నన్ను అడక్కపోయినా, చాలాసార్లు అభిప్రాయాలు అలవోకగా చెబుతుంటానని మా ఆవిడ గట్టి నమ్మకం అనుకోండి, అది వేరే విషయం) అంతా పేరులోనే ఉంది అంటాను. గ్లామరు కాని, గ్రామరు కాని పేరుతోనే మొదలవుతుంది నా లెక్కప్రకారం. మీకెవ్వరికైనా ఈ విషయం మీద నమ్మకం లేకపోతే ఓ గంట నా పేరు పెట్టుకుని చూడండి. ఆ పేరుతో మీకిష్టమైన వాళ్లతో కాసేపు, కష్టమైనవాళ్లతో కాసేపు.. ఓ పది నిమిషాలు మురిపెంగా, మరో పది నిమిషాలు కోపంగా పిలిపించుకుని ఆ తర్వాత మాట్లాడండి.
ఊహ తెలిసిన దగ్గర్నుంచి నా పేరు మోటుగా, నాటుగా ఉందనిన్నూ, ఏ ఆడపిల్ల అయినా నన్ను ప్రేమించడానికి అడ్డంకిగా ఉందనిన్నూ, ఆ మాటకొస్తే పిలవడానిక్కూడా పిసరంత అందంగా లేదనిన్నూ తెగ ఫీల్ అయిపోయేవాన్ని. టీనేజిలో మన ఫేస్ టామ్ క్రూజ్‌కి దగ్గరగానూ, కమల్‌హాసన్‌కి మరీ దగ్గరగానూ ఉన్నట్టుగా ఫీలవుతుండేవాణ్ని. అప్పటికి మహేశ్‌బాబు చాలా చిన్న బుడతడులెండి. మన రేంజ్‌లో లేడు. మనకు మనమిచ్చుకున్న గ్లామర్ సర్టిఫికెట్‌తో పాటు నేను కొనిచ్చే మిరపకాయ బజ్జీల కోసం పక్కన చేరిన వందిమాగధుల పొగడ్తలు – వారేవా ఏమి ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసుఅని.
అలాంటి ఫేస్ పెట్టుకుని ఇంటర్మీడియెట్ రెండేళ్ళూ ఎదురు చూశా.. ఏ ఒక్క ఆడపిల్ల అయి నా ఓ ప్రేమలేఖ రాస్తుందని. కొంతమంది నావైపు అదోరకంగా చూసేవాళ్లు కానీ, వాళ్లెవరి నుంచీ ఉత్తరాలు వచ్చినట్టు తోచదు. నూనూగు మీసాల వయసులో చాలామందికి వచ్చే ఈ ప్రేమలేఖా రాహిత్య ప్రేరేపిత దుర్భర జీవిత రోగంనాక్కూడా అంటుకుంది. అప్పుడు సిద్ధాపంతుల అని చిన్నప్పటి నుంచి నా క్లాస్‌మేట్ – ఒరేయ్ మూర్ఖా వినుఅని ఓ క్లాస్ పీకాడు.
ఒరేయ్ నీకు గుర్తుందా? హైస్కూల్‌లో నిన్ను రెడ్డీ మడ్డీ సాంబ్రాణి కడ్డీఅని ఆడుకునేవాళ్లు. ఆ పేరేరా నీకు శత్రువు. ఏ ఆడపిల్ల అయినా డియర్ రమేష్ అనో, డియర్ సురేష్ అనో రాయాలనుకుంటుంది. కానీ.. ప్రియమైన గురవారెడ్డికి అని లవ్ లెటర్ ఎలా రాయగలదురా? ఒరేయ్ నీ ఫేస్ అవ్వొచ్చు ముద్దు. కానీ నీ పేరుతో అది రద్దు” అని నా పేరు ప్రతిష్టలన్నీ చీల్చి చెండాడేశాడు.
అంతటితో ఆగకుండా వాడి నవలా సాహిత్యం, సినిమా పాండిత్యం ఉపయోగించి, ‘యద్ధనపూడి నవలల్లో హీరోల పేరు రాజశేఖర్ అనో, చక్రవర్తి అనో ఉంటాయి కానీ… ఎక్కడన్నా గురవారెడ్డి అని ఉందిరా? ఇన్ని సినిమాలు చూస్తున్నాం, ఏ సిన్మాలో అన్నా ఎంటీవోడు కానీ, ఏయన్నార్ కానీ, కృష్ణ కానీ, శోభన్‌బాబు కానీ, నీ పేరు పెట్టుకున్నాడురా? కాబట్టి ఆ పేరు ఉన్నన్నాళ్లూ నీ జీవితానికి ప్రేమ లేదురా.. అంతే… అంతే…   అని ఏయన్నార్ స్టైల్‌లో పక్కనే ఉన్న ఎండిపొయిన చెట్టు మీదికి జారిపోయాడు.
 
జ్ఞానోదయం అయిన నేను వెంటనే పరిగెట్టుకుని వెళ్లి, మా నాన్నతో నా పేరు రవిగా మార్చుకుందా మనుకుంటున్నాను అని చెప్తే.. ఆయన ఓ జెల్లకాయ, మొట్టికాయ కలిపి హైబ్రిడ్ జెట్టికాయ ఇచ్చి.. “ముందు చదివేడు, పేరు మార్చుకోవడం కాదు.. పేరు తెచ్చుకోవాలి” అని మరో ప్రైవేట్ క్లాస్ తీశారు. రవి అని పేరు మార్చుకోగానే “రవీ, నువ్వే నా ప్రేమ కవీ, మనిద్దరం పట్టించుకోవద్దు అవీ ఇవీ” అని ప్రాసాపూరితమైన లేఖ వస్తుందని తెగ ఇదయిపోతున్న నా గుండెపై వందల గునపాలు దిగాయని మీకెలా చెప్పను?.
అలానే, అదే ఫేస్‌తో గుంటూర్ మెడికల్ కాలేజీలో చేరాను. అప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్లు, ఏనుగు చెవుల కాలర్‌లున్న షర్టులు ఫ్యాషన్.(అర్ధం కాకపోతే వేటగాడు సిన్మా చూడుడు), Mayo క్లినిక్‌లో లివర్లు మార్చుకుంటూ, కిడ్నీలు కూర్చుకుంటూ బతుకుతున్న సుధాకర్‌గాడు ఆ రోజుల్లో ఫ్యాషన్‌ని ఇంకొంచెం సాగదీసి, ఎలిఫెంట్ బాటమ్ లు వేసేవాడు. మన రూటే వేరు టైపులో నేను ఫ్యాషన్‌కి ఎదురీది న్యారో ప్యాంట్స్, అంటే గొట్టం ప్యాంట్లు వేసేవాణ్ని.. అంతే.. వారం రోజుల్లో గొట్టం గురవారెడ్డిఅనే పేరు స్థిరపడిపోయింది. అమ్మానాన్నలు పెట్టిన పేరుకే తెగ సిగ్గు పడిపోతుంటే, ఈ గొట్తం బిరుదు నన్నింకెంతగా కలవరపరిచి ఉంటుందో ఊహించుకోండి.
మనింట్లో కరెంటు పోయినప్పుడు ముందుగా పక్కింట్లో కూడా పోయిందా లేదా చూసుకుంటాం. అక్కడ కూడా పొతే హమ్మయ్య అనుకుంటాం. అంటే మన ఇబ్బంది పక్కింటివాడి ఇబ్బంది కూడా తోడుంటే ఆ హాయే వేరు. అలానే నా క్లోజ్ ఫ్రెండ్స్‌కి కూడా నాలాంటి నాటు పేర్లు ఉంటే బాగుండేది అనుకోవడంలో తప్పు లేదు కదా! ఉదాహరణకి నా మిత్రుడొకడికి పెంటారెడ్డి  పేరుందనుకోండి.. అద్భుతం కదా!  సుధాకర్, భాస్కర్, శివనారాయణ, ఉమా మహేశ్వర్ లాంటి దేవుళ్ల పేర్లు.. టాగూర్, గోఖలే, గాంధీలాంటి మహానీయుల పేర్లు ఉన్నవాళ్లే తయారయ్యారు నా చుట్టూ..
అలా పేరూ పెటాకులూ లేకుండా తిరుగుతున్న రోజుల్లో హఠాత్తుగా దేవుడు కనిపించాడు ఇద్దరు సీనియర్ల రూపంలో. ఒకాయన పేరు పెద్దబ్బాయి. ఇంకొకాయన పేరు తాతయ్య. అంతే.. ఆ రోజు నుంచీ నా పేరు చాలా అందంగా కనబడసాగింది. సపోజ్ తాతయ్యని ఓ అమ్మాయి లవ్ చేసిందనుకోండి… డియర్ తాతయ్యా… ఐ లవ్యూఅని రాయగానే ఇంకెక్కడి రొమాన్స్ అండీ బాబూ. అంతా నీరు కారిపోదూ!
నేను తర్వాత ఈ పేర్ల గురించి చాలా రిసెర్చ్ చేశాను. దాంట్లో తేలిందేమిటంటే.. మన రాష్ట్రాలలోనే ఇలాంటి వింత వింత పేర్లుంటాయని. ముందుగా ఒకరిద్దరు పిల్లలు చిన్నప్పుడే చనిపోతే దిష్టి తగలకూడదని తర్వాతి వాళ్లకి మోటు పేర్లు పెడతారట. ముత్తాతల పేర్లు, దేవుళ్ల పేర్లు కూడా మన సంప్రదాయమే. నాకు చిన్నప్పుడు ఓ స్నేహితుడుండేవాడు. వాడి పేరు వెంఖట శివ రామ కృష్ణ భాస్కర ప్రసాద్. ఏ దేవుడినీ హర్ట్ చేయకుండా అందరినీ కల్లిపేసుకుపోవడం అంటే ఇదేనేమో!
నార్త్ ఇండియన్ పేర్లు గమనించారా?? అందరి పేర్లూ ముద్దుగా రాహుల్ అనో, రిషీ అనో, విజయ్ అనో ఉంటాయి. వాళ్లకు మన సెంటిమెంట్స్ లేవనుకుంటా. ఆ తర్వాత ఇంగ్లండ్‌కి వెళ్లాక తెలిసింది. అక్కడ కూడా విరసమైన ఇంటిపేర్లుంటాయని   ఓ ప్రొఫెసర్ ఇంటిపేరు ప్రౌడ్‌పుట్. మరో ప్రొఫెసర్ పేరు హస్బెండ్. సెక్రెటరీ లెటర్ రాసిందనుకోండి.. డియర్ హజ్బెండ్ అని.. ఏదోలా ఉండదూ!
ఇంతకీ నా పేరుకి ఒక్క లవ్ లెటర్ అయినా వచ్చిందా లేదా అని మీ అందరికీ అనుమానంగా ఉంది కదా! ఒక్కటేంటి ఖర్మ.. వందలొచ్చాయి. అవన్నీ ఒక్కమ్మాయి నుంచే.. ఆమె నా పేరుని ముద్దుగా గురివికింద మార్చుకుంది. అఫ్‌కోర్స్.. కోపం వచ్చినపుడు కొరివిఅంటుందనుకోండి…
(మా ముత్తాత పేరు పెట్టి.. నేను పెట్టిన పేరు కాదురా డింబకా, నీ అంతట నువ్వు పేరు తెచ్చుకోఅని ప్రోత్సహించి, నాకు విలువలు నేర్పి , నాకు కొద్దోగొప్పో పేరొచ్చేవరకు నిద్రపోని మా నాన్నకి క్షమాపణలతో…