guravayanam

భళా బాహుబలి భళా…

నాకు చిన్న‌ప్పటి నుంచి బంధువులు ఇంటికి వ‌స్తున్నారంటే సూప‌ర్ హ్యాపీస్ అన్న మాట‌. ఎందుకంటే బంధువుల‌న్నాక స్వీట్లు, హాట్లు పొట్లాలు క‌ట్టించుకొని తెచ్చేవారు. వాటిని హ్యాపీగాలాగించేయ‌చ్చు. స‌రి కదా, వాళ్లు ఉన్నంతసేపు ఎంత అల్ల‌రి చేసిన అమ్మా నాన్నఏమీ అనేవారు కాదు, ఆ త‌ర్వాత వీపు విమానం మోత ఎక్కిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయ‌నుకోండి. ఈవిష‌యం ప‌క్క‌న పెడితే  మొన్న‌టి ఆదివారం నాడు చుట్టాలొస్తున్నారంటే అంతే ఆనందం క‌లిగింది. ఎందుకంటే వ‌చ్చిన చుట్టాలు ఎవ‌రంటే ఇప్పుడు దేశ‌మంతా మోత మోగిస్తున్నబాహుబ‌లి సృష్టిక‌ర్త రాజ‌మౌళి, ఆయ‌న భార్య ర‌మా రాజ‌మౌళి మరియు మౌళి వ‌దిన‌గారైన వ‌ల్లీ కీర‌వాణి. మాది సినిమాల‌తో పెన‌వేసుకొన్న కుటుంబం అన్న సంగ‌తి మీకు తెలుసు క‌దా. మాపెద్ద తోడ‌ల్లుడు అయిన గుణ్ణం గంగ‌రాజు (అప్ప‌ట్లో అమృతం సీరియ‌ల్, త‌ర్వాత లిటిల్ సోల్జ‌ర్స్, చంద‌మామ క‌థ‌లు వంటి సినిమాల సృష్టిక‌ర్త‌) కి ర‌మా రాజ‌మౌళి మ‌రియు వ‌ల్లీ కీర‌వాణిస్వ‌యానా చెల్లెల్లు. అంటే నాకు కూడా చెల్లెల్ల వ‌ర‌సే క‌దా.
అదే అభిమానం.. అదే ఆప్యాయ‌త‌..!
రమ, వల్లి, “అన్నయ్య” అని ఆప్యాయంగా ఒదిగిపోయారు. నేను మొదట్లో పంజాగుట్ట‌లో డా. మోహ‌న వంశీ (ఇప్పుడు ఒమెగా ఆసుప‌త్రి అధినేత‌) తో క‌లిసి హాస్పిట‌ల్ పెట్టిన‌ప్పుడు ఇద్ద‌రూవిచ్చేసి శుభాకాంక్ష‌లు చెప్పి వెళ్లారు. అప్పుడు బ‌హుక‌రించిన గ్రీటింగ్ కార్డును ఇప్ప‌టికీ భ‌ద్ర ప‌రిచాను. ర‌మ‌కు అయితే ఆసుప‌త్రుల లోకం కాస్తంత ట‌చ్ ఉంది. ఎందుకంటే హైద‌రాబాద్వ‌చ్చిన కొత్త లో నేను అపోలో లో ప్రాక్టీస్ చేసిన‌ప్ప‌పుడు కొంత కాలం అసోసియేట్ అయింది కూడా. వాస్త‌వానికి అప్ప‌ట్లో రాజ‌మౌళి టీవీ సీరియల్స్ తీస్తూ కెరీర్ లో ఎదుగుతున్నారు. నేనుకూడా ప్రాక్టీస్ లో కొత్త. దాదాపుగా ఇద్ద‌రూ స‌మాంత‌రంగా వృత్తుల‌లో ఎదుగుతూ వ‌చ్చాం. ఎటొచ్చీ ఆయ‌న‌ సినిమా థియోట‌ర్ ల‌లో సక్సస్ అయితే నేను ఆప‌రేష‌న్ థియోట‌ర్ల‌లో విజ‌యంసాధించా.
రాజ‌మౌళి అంటే అందుకే ఇష్టం.
రాజ‌మౌళి అంటే మీ అంద‌రికీ చాలా ఇష్టం. ఎందుకంటే గొప్ప ద‌ర్శ‌కుడు. అద్భుత మైన సినిమాలు తీసి తెలుగు సినిమాకు అంత‌ర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాడు. మేమంతా ఆయ‌న్నినంది అని పిలుచుకొంటాం. ఆయ‌న్ని చాలా ద‌గ్గ‌ర నుంచి చూసిన అతి కొద్ది మందిలో నేనూ ఒక‌డ్ని. నాకు మ‌రో కార‌ణంగా ఇష్టం అన్న‌మాట‌. ఆయ‌న ఎంత ఎత్తుకు ఎదిగినా చాలాహంబుల్ గా, హ్యుమిలిటీ తో ఉంటారు. ముఖ్యంగా ఆయ‌న చాలా త‌క్కువ మాట్లాడతారు. మ‌నం బాగా ఎక్కువ మాట్లాడ‌తాం కాబ‌ట్టి ఆయ‌న బాగా న‌చ్చుతారు. మ‌నం ఎంత చెల‌రేగిపోయిమాట్లాడుతున్నా చిరున‌వ్వుతో ఆస్వాదిస్తుంటారు. ఉత్త‌మ శ్రోత‌లు అంటే మ‌న లాంటి వాళ్ల‌కు ఎంత లైకింగో చెప్ప‌న‌క్క‌ర లేదు క‌దా. ఆ రేంజ్ లో హ్యుమిలిటీ తో ఉండేవారంటే నాకు చాలాప్రీతి. ఈ రోజుల్లో 10 పైసలు టాలెంట్ ఉంటే రూపాయి మేర క‌టింగ్
కొట్టే వాళ్ల‌ను చూస్తాం. అటువంటిది అంత ఎత్తుకి ఎదిగినా చాలా సింపుల్ గా నేల మీద న‌డ‌వ‌టం అంటే మామూలువిష‌యం కాదు క‌దా..  ఫ్యామిలీ మ్యాచ్ వంటిదే వాస్త‌వానికి రాజ‌మౌళికి ఈ విజ‌యంలో కుటుంబ తోడ్పాటు చాలా ఉంది. ఎందుకంటే భార్య ర‌మ‌, వ‌దిన గారైన వ‌ల్లీ చాలా స‌హ‌క‌రించారు. ర‌మా రాజ‌మౌళి చాలా అద్భుత‌మైన వ్య‌క్తి. చాలాడెడికేటెడ్ గా ప‌నిచేస్తుందామె. ఒక వైపు భ‌ర్త కు సినిమా ప్రొడ‌క్ష‌న్ లో ఊపిరి స‌ల‌పని రీతిలో తోడ్పాటు అందిస్తూనే, మ‌రో వైపు ఇంటి ద‌గ్గ‌ర అంద‌రికీ వండి పెట్ట‌డం, ఆద‌రించ‌టం వంటివిచేస్తూ కంప్లీట్ ఫ్యామిలీ లేడీ లా క‌నిపిస్తారు. ఒక‌ర‌కంగా రాజ‌మౌళికి కావ‌ల‌సినంత కంఫ‌ర్ట్ జోన్ ను త‌యారు చేసి పెట్టారామె. ఇక వ‌దిన గారైన వ‌ల్లీ కీర‌వాణి అయితే బాహుబ‌లి యూనిట్ కువెన్నుముక‌లా నిలిచారు. ఆమె ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూస‌ర్ అంటే అంద‌రినీ లైన‌ప్ చేసుకోవాలి. తెల్ల‌వారు జాము నుంచి రాత్రి పొద్దు పోయేవాదాకా అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసుకొంటూరావాలి. ఈ సినిమా విషయంలో రాజమౌళి తో పాటు అంతే రేంజ్ లో కష్టపడ్డారన్న మాట.
ఈ సారి ట్రెండ్ మార్చా..!
క్రికెట్ మ్యాచ్ కు మంచి బౌల‌ర్‌, మంచి బ్యాట్స్ మెన్ ఉంటేనే బాగుంటుంది. ఇద్ద‌రూ బౌల‌ర్లు అయినా, ఇద్ద‌రూ బ్యాట్స్ మ్యాన్ అయినా వ‌ర్క‌వుట్ కాదు. అలాగే రాజ‌మౌళి, నేను ఒక‌చోటక‌లిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయ‌న త‌క్కువ‌ మాట్లాడ‌తారు. మ‌నం చాలా చాలా ఎక్కువ‌గా మాట్లాడ‌తాం. కానీ ఈ సారి మాత్రం ఆయ‌న్ని తెలివిగా ముగ్గులోకి దించా. చాలాస‌సేపు మాట్లాడుకొన్నాం. ఒక ర‌కంగా ఆయ‌న్ని ఇంట‌ర్వ్యూ చేశా అన్న మాట‌. రాజ‌మౌళిని త‌ర్వాత సినిమా ఏమిటి అని సూటిగా అడిగేశా. ఇంకా ఏమీ ఆలోచించ లేదు అని ఆయ‌నబ‌దులిచ్చారు. అయితే త‌ర్వాత సినిమాలో మాత్రం పెద్ద‌గా గ్రాఫిక్స్ వాడ‌టం లేద‌ని మాత్రం చెప్పారు. తింటే గారెలు.. వింటే సారీ తీస్తే భారతం తీయాలి.. మ‌హా భార‌తం చేయ‌చ్చుగా అంటే మాత్రం త‌న‌కూ అదే ఆలోచ‌న ఉంద‌ని చెప్పారు. వాస్త‌వానికి భార‌తం మీద మ‌న‌కు చాలానే సినిమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు టెక్నాల‌జీ పెరిగి వెండితెర విస్త్ర‌తి పెరిగాక రాజ‌మౌళి వంటి వారు తీస్తే ఆ సినిమా అద్బుత క‌ళా ఖండం అయి తీరుతుంది. వాస్త‌వానికి తెలుగు సినిమా అంటే పెద్ద మార్కెట్ ఉండ‌దు, డ‌బ్బు పెట్ట‌లేం అనేవారుకానీ వంద కాదు 4 వంద‌ల కోట్లు పెట్టినా స‌రే తిరిగి రాబ‌ట్టుకోవ‌చ్చు అని రాజ‌మౌళి రుజువు చేశారు. బాహుబ‌లి కే ఐదేళ్లు ప‌డితే మ‌హా భార‌తానికి ప‌దేళ్లు దాటుతుంది అనుకొనేరు, కానే కాదు.ఎందుకంటే భారీ గ్రాఫిక్స్ ను ఎలా వాడుకోవాలి, హెవీ యూనిట్స్ ను ఎలా న‌డిపించాలి అన్న దాంట్లో ఆయ‌న త‌ల పండిపోయారు కాబ‌ట్టి త‌క్కువ వ్య‌వ‌ధిలోనే తీయ‌గ‌ల‌రు అనిఅనుకొంటున్నా. వాస్త‌వానికి భార‌తం అంటే నాకు చాలా ఇష్టం. యుద్దం సీన్ త‌ర్వాత బోలెడు ఎముక‌లు పోగు ప‌డ‌తాయి కాబ‌ట్టి ఇష్టం అనుకొనేరు, అందులో ఉండే అనేక పాత్ర‌లు, వాటివ్య‌క్తిత్వాలు క‌థ‌నాలు అంటే ఇష్టం అన్న మాట‌. అందుచేత ఇంత‌టి విస్తార‌మైన మ‌హాభార‌తాన్ని రాజ‌మౌళి త‌న‌దైన స్థాయిలో తీసి సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇవ్వాల‌ని ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే బాహుబ‌లి సెకండ్ పార్ట్ కూడా హిట్ అని నేను న‌మ్మిందే రుజువైంది కాబ‌ట్టి..!