Blog

సైకిల్ తో నా ప్రేమాయణం..!

సైకిల్ తో నా ప్రేమాయణం..!

గురవాయణం పాఠకులకు స్వాగతం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెత నా గురించే పుట్టింది అని నా ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు ఎంత ఆనందంగా, హుషారుగా ఉంటానో అంతే హుషారుగా, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన హుషారుగా చిన్నప్పుడు ఉండేవాడిని. వెన్నెల రాత్రుల గురించి కవులు ఏం రాశారో తెలియదు కానీ, స్కూల్ విడిచిన సాయంత్రాల గురించి నేను టన్నుల కొద్దీ రాయగలను. పాఠకుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోవటంతో కుదించి క్లుప్తంగా సరిపెడుతున్నానన్న మాట.

మా ఊరి స్కూల్ లో టీచర్లకు ముందు చూపు బాగా ఎక్కువ. అందుకే క్లాసులో గడియారం లేకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ అఖండమైన తెలివితేటలకు మా బ్యాచ్ పెట్టింది పేరు కాబట్టి గుమ్మం నుంచి ఎండ ఎంత లోపలకు వస్తే స్కూల్ లాంగ్ బెల్ అవుతుందో ముందే గుణించి పెట్టుకొనేవాళ్లం. ఇప్పుడు స్కూల్స్ లేక కాలేజీల ఇరుకు గదుల్లో ఎండ నీడ కు ఛాన్సే లేదని నాకూ తెలుసు. మా రోజుల్లో ఆ ప్లేస్ కు ఎండ కొంచెం కొంచెంగా వస్తుంటే, మా మనస్సుల్లో హుషారు అంతే రేంజ్ లో ఉరకలు వేస్తూ ఉండేది. బెంచ్ మార్క్ దగ్గరకు ఎండ చేరుతుండగానే బెల్ మోగేదన్న మాట. ఆ సమయానికి బ్లాక్ బస్టర్ హీరో ఎవరు అంటే లాంగ్‌ బెల్ కొట్టగానే పుస్తకాలు పుచ్చుకొని రివ్వుమని బయటకు దూసుకెళ్ల గలిగే వాడు అన్న మాట. ఎవడు వేగంగా స్కూల్ గేటు దాటితే వాడు అంత ఛాంపియన్ అన్న మాట. అక్కడకు వెళ్లాక మిగిలిన క్లాసుల్లోని గాలి బ్యాచ్ కూడా అక్కడ జమ అయ్యే వాళ్లం. హాఫ్ నిక్కర్ లో అరచేతులు పెట్టుకొని కార్యాచరణ ను చర్చించుకొనే వాళ్లం. అందమైన సాయంత్రాన్ని అంతే అందంంగా ఎలా గడపాలి అనే దాని మీద డిస్కస్ చేసుకొనే వాళ్లం. బాహుబలి సినిమా తీయటానికి రాజమౌళి గారు కూడా ఆ రేంజ్ లో టీమ్ తో డిస్కస్ చేసి ఉండరని నా ప్రగాఢ విశ్వాసం.

ఈ సాయంకాలపు సరిగమల్లో సైకిల్ తొక్కటం అన్నది ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది. అప్పట్లో చాలా మంది సైకిళ్ల మీద ఎక్కువగా ప్రయాణం చేస్తుండేవారు. ఇంటి దగ్గర సైకిల్ ను ఎలా దొరక పుచ్చుకోవాలన్నది వ్యక్తిగత మైన విషయం. ఒక వేళ ఆ వెసులు బాటు లేకపోతే మాత్రం అద్దెకు సైకిళ్లు దొరుకుతూండేవి. అర్ధ రూపాయి చెల్లిస్తే అరగంట సేపు సైకిల్ మీద రౌండ్లు కొట్టవచ్చన్నమాట. సైకిల్ మీద రౌండ్లు కొట్టడం అంటే ఆషామాషీ కాదు. అప్పట్లో ఎన్టీయార్‌, ఏ యన్నార్ , కాంతారావు వంటి హీరోలు గుర్రాల మీద దౌడు తీస్తూ కనిపించేవారు. మాకు అశ్వారోహణం అన్నది వీలు కాదు కాబట్టి సైకిల్ నే గుర్రం గా భావించేవాళ్లం. సైకిల్ మీదకు ఎగిరి ఎక్కేవాడు ఒకడైతే, పరిగెత్తించి దూకేవాడు మరొకరు. చిన్న వాళ్లకు ఫెడల్ తొక్కుకోవటం అనే ఆప్షన్ కూడా ఉండేదనుకోండి. మొత్తం మీద సైకిళ్లేసుకొని వచ్చాక ఒక సెంటర్ కు చేరాలి అని ముందే ఫిక్సు చేసుకొని ఉండేవాళ్లం. అక్కడకు చేరుకొన్నాక ఏ రూట్ లో వెళ్లాలి అనే దాని మీద రూట్ మ్యాప్ ఖరారు చేసుకొనేవాళ్లం. ఎందుకంటే పేరంట్స్ సాయంత్రం బాగా తిరిగే ఏరియాల్ని చూసుకొని, అటువైపు పోకుండా వేరే రూట్స్ ట్రై చేయాలన్న మాట.

అయితే స్కూల్ లో బాగా చదివేసుకొని ఇంటికి వచ్చాం అన్న ఫీలింగ్ అమ్మలకు సహజం. అందుచేత వేరుశనగ పప్పు, బెల్లం ఉండలు రెడీ చేసి ఉంచేవారు. హాఫ్ నిక్కర్ లోని రెండు జేబుల్లో ఇటువంటి మందు గుండు కూరుకొని సైకిల్ మీద స్వారీ మొదలెట్టేవాళ్లం.సైకిల్ తొక్కుతూనే జేబులోంచి ఇవి తీసుకొని తింటుండాలి తప్పితే తినేసి బయలు దేరేంతటి ఖాళీ ఉండేది కాదు. ఇప్పటికీ నాది అదే పరిస్థితి. ఉదయాన్నే హాస్పిటల్ కు వచ్చేసి ఆపరేషన్స్ మొదలెట్టాలి. ఈ లోగా విజిటర్స్ లేదా స్టాఫ్ తో మాట్లాడాాలి. అందుచేత టైమ్ సేవ్‌ చేసుకొనేందుకు బ్రేక్‌ ఫాస్ట్ చేస్తూనో, స్నాక్స్ తింటోనో ఇటువంటి మీటింగ్స్ పూర్తి చేసుకొంటాను. అప్పట్లోనే పువ్వు పుట్టి పరిమిళించిన టైమ్ లోనే ఇటువంటి అలవాట్లన్నీ చేసుకొన్నా అన్న మాట. అంతే కాదండోయ్‌, సైకిల్ మీద వెళుతూనే మన దగ్గర ఉన్న బెల్లం ఉండ వేరే వాడికి ఇవ్వటం, అతని దగ్గర నుంచి నువ్వుల ఉండ తీసుకోవటం వంటి షేరింగ్‌ పనులు కూడా చేసేవాళ్లం.

ప్రతీ రోజూ ఒకటే పని చేస్తే బోర్ కొడుతుంది. అలాగే ప్రతీ రోజూ మన సైకిలే తొక్కితే బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ప్రెండ్స్ మధ్య సైకిళ్లు ఎక్స్చేంజ్ చేసుకొనే వాళ్లం. ఒక రోజు అలాగే మా ఫ్రెండ్ నాసైకిల్ తీసుకొని రివ్వున దూసుకెళ్లిపోయాడు. బ్రేకులు సరిగ్గా లేవని నేను చెప్పేసరికే దౌడు మొదలెట్టేశాడు. . ఆ పాటికే అటుగా నీళ్లు తెచ్చుకొంటున్న ఒక ముసలావిడను గుద్దేశడు. ఇక చూసుకోండి, ఆవిడ అచ్చ తెలుగులో అందమైన ఆశీర్వాదాలు ఇస్తుంటే, ఆ వీధిలోని వారంతా బయటకు వచ్చేశాురు. అందులో మా క్లాస్ మేట్ లు కూడా ఉండటంతో మా వాడి అవస్థ వర్ణనాతీతం. ఈ కంగారులో హాఫ్ నిక్కర్ జారిపోతుంటే, అది ఒక చేత్తో, సైకిల్ ఒక చేత్తో పట్టుకొని పరుగో పరుగు. ఇటువంటి ఎపిసోడ్ లు జరిగినప్పుడు మర్నాడు స్కూల్ లో అదే హాట్ టాపిక్ అన్న మాట. ఇటువంటి విషయాల్ని విడమరిచి చెప్పాలంటే నా తర్వాతే.

మా బ్యాచ్ లో ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. సైకిల్ ను మెయింటెయిన్ చేయటంలో వాడు ఎక్సు పర్టు.ఊరిలో అమ్మాయిలున్న వీధిలోకి వెళ్లేసరికి వాడి సైకిల్ చెయిన్ ఆటోమేటిక్‌ గా ఊడిపోయేది. దీంతో వాడు అక్కడ దిగిపోయి చెయిన్ పెట్టుకొనే నెపంతో కాసేపు అక్కడే కాలక్షేపం చేసేవాడు. మేం పిల్ల కాకులం కాబట్టి అప్పట్లో ఆ విషయం మాకు అర్థం అయ్యేది కాదు. తర్వాత కాలంలో కాలేజీకి వచ్చాక వాడి టెక్నిక్ మేం తెలుసుకొన్నాం. మా కుర్రబ్యాచ్ మాత్రం సైకిల్ విన్యాసాలకే పరిమితం అయ్యేది. వేగంగా సైకిల్ ను దౌడు తీయించటం, బ్రేక్ వేసినా కాలు కింద పెట్టకుండా నిలిపి ఉంచటం, భుజాల మీద చేతులు వేసుకొని సైకిల్ ను తీసుకెళ్లటం.. ఇలా అనేక అనేక విన్యాసాలు చేసేవాళ్లం. ఇంత గొప్ప ఘన కార్యాలు చేస్తున్నా పేరంట్స్ కు తెలియకుండా జాగ్రత్త పడటమే మా గొప్పతనం. అప్పట్లో ఒలింపిక్స్ గురించి అవగాహన లేదు కానీ లేదంటే మా బాపట్ల బ్యాచ్ సైక్లింగ్ లో ఒక డజను గోల్డ్ మెడల్స్ తెచ్చేసుకొని ఉండేవాళ్లం.

ఇన్ని ఘనకార్యాలు చేసినా ఎప్పుడు ఫిట్ గా ఉండేందుకు ఈ సైక్లింగ్‌ బాగా ఉపయోగపడేది. అందుచేత వీలైతే ఇప్పటి పిల్లలతో కూడా ఖాళీ సమయాల్లో సైకిల్ తొక్కించటానికి ప్రయత్నించండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం.
..
మీ గురవారెడ్డి.