Blog

జంకుతున్న ఫుడ్డు..!

జంకుతున్న ఫుడ్డు..!

గురవాయణం పాఠకులకు స్వాగతం. కంటికి, పంటికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మనస్సుకి నచ్చిన వాటిని బాగా చూడాలని కన్ను, నచ్చిన వాటిని బాగా తినాలని పన్ను ఆశపడుతుంటాయి. అదిగో అలా ఆశగా తినేసిన తర్వాత జరిగే అనర్థం అంతా ఇంతా కాదు. ఆశగా చూసేసే కన్ను, ఆబగా తినేసే పన్ను బాగుపడినట్లు చరిత్రలో లేదని అప్పట్లోనే రజనీకాంత్ గారు చెప్పేశారు. అయినా సరే, మనవాళ్లు అస్సలు తగ్గటం లేదు. ఆబగా అడ్డమైన గడ్డి ను ఫుడ్డు రూపంలో తినేస్తుంటారు. ఆ పై అవస్థలు పడుతుంటారు.

ఈ కాలం యువత కు అతి పెద్ద అగ్ని పరీక్ష ఉదయాన్నే నిద్ర లేవటం. చాలా మంది బద్దకానికి ట్రేడ్ మార్క్ ఐకాన్స్ లా బిహేవ్ చేస్తున్నారు. పెద్దవాళ్లు ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్ని మిక్స్ చేసి మొరపెట్టుకోగా, తెల్లారిన చాలా సేపటికి మంచం మీద నుంచి కష్టంగా కదులుతున్నారు. ఆ వెంటనే బ్రష్‌ తీసుకోవటానికన్నా ముందు ఫోన్స్ చెక్‌ చేసుకోవాల్సిందే. ఆ తర్వాాత కూడా కాలేజీకి లేదా ఆఫీసుకి తెముల్చుకోవాలంటేబద్దకం వెంటాడుతూ ఉంటుంది. ప్రపంచ యుద్దం చేసిన రేంజ్‌ లో బ్రష్‌ చేసి, ఆ పై ఫ్రెష్ అయ్యి అతి కష్టం మీద బ్యాగ్‌ సర్దుకొని బయట పడుతుంటారు. ఈ హడావుడిలో బ్రేక్‌ ఫాస్ట్ ఎగ్గొట్టేసి, డైటింగ్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని రోడ్డెక్కెస్తారు.

ఈ మద్య కాలంలో ఇంకో ట్రెండ్ మొదలైంది. పిజ్జా లేదా బర్గర్ వంటి ఫుడ్స్ తీసుకొని ఫోటో తీసుకోవాలి. దాన్ని స్నాప్‌ చాట్ లో కానీ, వాట్సప్ స్టాటస్‌ లో కానీ అప్‌ డేట్ చేయాలి. అదే సాంప్రదాయ ఫుడ్ అంటే అలా అప్‌ డేట్ చేయలేరు కదా. అందుకని జంక్ ఫుడ్ నే తీసుకొంటున్నారు. ఆ పై పొలోమంటూ ఫోటోలు తీయటం, వాటిని అప్‌ డేట్ చేసేయటం. ఫోటోలకు ఏది మంచిదో చూస్తున్నారే కానీ, కడుపుకి ఏది మంచిదో ఏమాత్రం చూడటం లేదు. ఈ లోగానే ఇతరులు ఏమి అప్ డేట్ చేశారో చూసుకొంటూ, వాటికి లైక్స్ కొట్టుకొంటూ జంక్‌ ఫుడ్ లాగిస్తుంటారు. ఈ హడావుడిలో కడుపులో ఎంత వేస్తున్నారో, ఏమి వేసుకొంటున్నారో కూడా గమనించుకోలేని పరిస్థితి.మొన్నా మధ్యన ఒక కుర్రాడు వాట్సప్ చూసుకొంటూ, పిజ్జాతో పాటు టిస్యూ పేపర్ కూడా నమిలేశాడట. అది కక్కించటానికి నానా అవస్థలు పడాల్సి వచ్చిందట.

ఈ వాట్సప్ స్టేటస్ లు కూడా గతంలో బుజ్జి కారుల్లా ఒకటో, రెండో ఉండేవి. ఇప్పుడు గూడ్స్ బండి పెట్టె ల మాదిరిగా పెరిగిపోతూ కనిపిస్తున్నాయి. దీంతో వాటన్నింటిని చూసుకొని,, ఇమోజీ లు పెట్టుకొంటూ పోయేసరికి ఇక్కడ జంక్‌ ఫుడ్‌ కూడా అదే రేేంజ్‌ లో కరిగిపోతూ ఉంటుంది. ఈ హడావుడికి మధ్యాహ్నం లంచ్‌ ను ఎగ్గొట్టేయటమో లేక వాయిదా వేయటమో జరిగిపోతుంది. డైటింగ్‌ లో ఉన్నా మన్న లేబుల్‌ ఎలాగూూ ఉండనే ఉంటుంది. సాయంత్రం కూడా అదే పరిస్థితి. ఆఫీసు లేదా కాలేజీ టైమ్ అవుతూనే అంతా క్యాంటీన్ లు లేదా బేకరీలకు పరిగెత్తాల్సిందే. ఈ గుంపు అంతటికీ ప్రతీ రోజూ ఏదో ఒక సబ్జెక్టు దొరకుతూనే ఉంటుంది. అమ్మ నాన్న పెట్టిన ఫుడ్ ను డస్ట్ బిన్ లో వేసేసి, జంక్‌ ఫుడ్ ను కడుపులో వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కడుపును కూడా డస్ట్ బిన్ లా తయారుచేసేసి, అడ్డమైన చెత్తను కుక్కేసుకొంటున్నారు.

అప్పట్లో కుర్రకారు ఫుడ్ అంటే వేరుశనగ పప్పు, బెల్లం ఉండలు వంటివాటితో ఉండేది. వీటితో కావల్సినంత ప్రోటీన్స్, మినరల్స్ శరీరానికి దొరికేవి. కానీ ఇప్పుడు తింటున్న జంక్‌ ఫుడ్ తో అవసరమైన వాటికంటే అనవసరమైన ఫ్యాట్స్, ఆయిల్స్ వంటివి పోగుపడుతున్నాయి. అందుకే కుర్రకారు లో ఉండాల్సిన ఉత్సాహం ఉండటం లేదు. బద్దకంగా సాగుతుండటం, విసుగుదలతో మాట్లాడటం ఎక్కువ అయిపోతున్నాయి. ఈ పోకడలకు కారణాల్లో జంకు ఫుడ్డు కూడా ఒకటని గుర్తించుకోవాలి. అడపా దడపా జంక్ ఫుడ్ తినటంలో తప్పు లేదు కానీ, అస్తమానూ జంక్‌ ఫుడ్ తోనే కాలం గడపటం మాత్రం మంచిది కాదు. కడుపును బెస్టు ప్లేస్ గా ఉంచుకోవాలో, డస్టు బిన్‌ గా మార్చుకోవాలో మన చేతిలోనే ఉంది. అందుచేత బెస్ట్ ఫుడ్ కు జై కొట్టి బెస్ట్ అని పించుకొందాం.

మీ గురవారెడ్డి