Blog

గురవా రెడ్డి అను నేను..!

గురవా రెడ్డి అను నేను..!

ప్రపంచంలోని పెద్ద సమస్యల్లో హైదరాబాద్ ట్రాఫిక్ ఒకటి. అందరూ వెళ్లే టైమ్ లో రోడ్డు ఎక్కితే, గమ్యానికి చేరటం అన్నది మన చేతుల్లో ఉండదు. అన్ని మెట్రో నగరాల్లోనూ ఈ సమస్య తప్పదు. అందుకే వేకువగా బయలుదేరటం నాకు అలవాటు. హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ను తప్పించుకొనేందుకు పెందలాడే హాస్పిటల్‌ కు వెళ్లిపోతుంటాను. రాజేంద్ర నగర్ దాటి అత్తాపూర్ మీదుగా వెళుతుంటే చాలా సార్లు ఒక దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. స్కూల్ బస్సుల్ని ఆపి ఉదయాన్నే పిల్లలను బస్సుల్లోకి ఎక్కిస్తుంటారు. ఈ దృశ్యం చూసినప్పుడల్లా నాకు చిన్నప్పటి రోజులు గుర్తు వస్తాయి.

గుంటూరు జిల్లా బాపట్లలో నా బాల్యం గడిచింది. చిన్నప్పుడు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సమితి ప్రాథమిక పాఠశాలలో నా విద్యాభ్యాసం వికసించింది. నాన్నగారు అగ్రికల్చర్ యూనివర్శిటీ లో పెద్ద ప్రొఫెసర్‌ కాబట్టి నేను కూడా అద్భుతంగా చదివి అదరగొట్టాలని మా అమ్మ ఆశించేది. మనకేమో చదువు తప్ప అనన్నీ తలకు ఎక్కేవి. అందునా బాపట్ల బ్యాచ్‌ గురించి చెప్పాలంటే పేజీలు, బ్లాగులు, ముఖ పుస్తకాలు (ఫేస్‌ బుక్‌ లు) సరిపోవు. అప్పట్లోనే మా టీచర్లు బండెడు హోమ్ వర్క్ లు ఇచ్చి ఉత్తమ ఉపాద్యాయ అవార్డు కొట్టేయాలని ప్రయత్నించేవారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు.. చిన్నప్పుడే నాకు మెడికల్ నాలెడ్జి ఉండేది. అందుకే హోమ్ వర్క్ ఎక్కువ అయినప్పుడల్లా కొత్త కొత్త నొప్పులు బయట పెట్టేవాడిని, ఒక సారి తలనొప్పి, మరో సారి కడుపు నొప్పి, ఇంకోసారి కాళ్ల నొప్పులు చెప్పేవాడిని. చెప్పిన నొప్పి ని మరోసారి చెప్పకుండా సృజనాత్మకత ప్రదర్శించేవాడిని. అమాయకంగా ఆ మాటలు నమ్మేసిన మా అమ్మ నాకు సెలవు మంజూరు చేసేది.

అసలు ఆనందం అంటే వర్కింగ్ డే రోజున స్కూల్ ఎగ్గొట్టడంలోనే ఉంటుందని నేను నా ప్రిష్కిప్షన పేపర్ మీద రాసి మరీ చెప్పగలను.(( ఎందుకంటే ప్రిస్కిప్షన్ లో మా డాక్టర్ల రైటింగ్‌ అంత తేలిగ్గా అర్థం కాదు కాబట్టి )) సరే, బడి ఎగ్గొట్టిన తర్వాత .. నాన్నగారు యూనివర్శిటీకి బయలు దేరే దాకా మంచం మీద నుంచి కదిలేవాడిని కాదు. ఆయన గుమ్మం దాటగానే వెంటనే నా నొప్పులు మాయం అయ్యేవి. ఆ తర్వాత హ్యాపీగా హాఫ్ నిక్కర్ లో అరచేతులు జేబులో పెట్టుకొని షికారుకి బయలు దేరేవాడిని. రెగ్యులర్‌ గా మన లాగే స్కూల్ ఎగ్గొట్టిన ఫ్రెండ్ ఎవరో ఒకడు తగిలేవాడు. అంతే, చెరువు గట్టుకో, చింత చెట్టు దగ్గరకో చెక్కేసి ఐపీఎల్ కు బాబు లాంటి ఆటలన్నీ ఆడేసుకొనే వాళ్లం. సంఖ్యను బట్టి కొత్త కొత్త ఆటలు క్రియేట్ చేసుకొని మరీ ఆడేసుకొనే వాళ్లం. ఒకసారి ఇదే ఊపులో ఆటల్లో మునిగిపోయి ఉండగా, ఎవరో చెవులు మెలిపెట్టినట్లయింది. కట్ చేసి చూస్తే, మా స్కూల్ గుమస్తా గారు సమితి ఆఫీసుకి వెళుతూ మమ్మల్ని చూసేశారు. ఆ దెబ్బతో మర్నాడు స్కూల్ లో క్లాస్ టీచర్‌‌ గోడకుర్చీ వేయించేశారు.

అసలు గోడ కుర్చీ వేయటం అన్నది ఒక కళ. ఈ కళలో నైపుణ్యం రావాలంటే బోలెడు పుస్తకాలు చదివితేనో, హోమ్ వర్క్ లు చేస్తేనో రాదు. అందుకు రివర్స్ లో పనిచేస్తేనే సాధ్యం అవుతుంది. వీపుని గోడకు ఆనించి మోకాళ్ల మీదకు ఆన్చుకొని కూర్చొంటే మనస్సు తీరా నొప్పులు మొదలవుతాయన్న మాట. క్లాస్ లో మాస్టారు పాఠం చెబుతుంటే మనం బిక్క ముఖం వేసుకొని తోటి పిల్లల వంక చూస్తూ ఉండాలి. ఖర్మ కొద్దీ మామూలు సమయాల్లో మనల్ని అస్సలు పట్టించుకోని అమ్మాయిలంతా అదే పనిగా మా వంకే చూసే వారు. మోకాాళ్లు నొప్పులతో మేం పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆ స్ఫూర్తితోనే నేను జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీ రామారావు గారి మాదిరిగా పెద్ద శపథం చేసేసుకొన్నాను. ప్రపంచంలోని అతి పెద్ద సమస్యల్లో మోకాళ్ల నొప్పులు ఒకటని, దానికి పరిష్కారం చూపించటమే ప్రపంచానికి మనం చేసే పెద్ద మేలని డిసైడ్ అయ్యాను. ఆ స్ఫూర్తితోనే నేను మోకాలు కీళ్లు మార్పిడి చేసే స్పెషలిస్టుగా సేవలు అందిస్తున్నా అన్న మాట.

ఈ విషయాన్ని పక్కన పెడితే లైఫ్ లో ప్రతీది పాజిటివ్ గా తీసుకోవటం మనకు బటర్ తో పెట్టిన విద్య. స్కూల్ ఎగ్గొట్టినందుకు పనిష్‌ మెంట్ ఇచ్చారు కానీ, మన క్రియేటివిటీ మొత్తం స్కూల్ అంతా తెలిసిపోయింది. హాఫ్ నిక్కర్ వేసుకొన్న ఎన్టీయార్ లా క్రేజ్ వచ్చేసింది. హోమ్ వర్క్ ను తగ్గించుకోవటం, ఎక్కాలు ( దానిని తమరి ఆంగ్లమందు టేబుల్స్ అని అందురు ) ఎగ్గొట్టడం, నోట్స్ లు రాయకుండా మేనేజ్ చేయటం వంటి పెద్ద పెద్ద సమస్యలకు నన్ను పరిష్కార మార్గాలు అడిగేవారు. చిన్న క్లాస్, పెద్ద క్లాస్ అన్న తేడా లేకుండా అందరికీ చింత చెట్టు కింద కూర్చోబెట్టి ( అప్పట్లో మా ఊరిలో బోధి వృక్షం లేనందున ) జ్నానోదయం కల్పించేవాడిని. ఈ విధంగా శతకోటి సమస్యలకు అనంతత కోటి ఉపాయాలు చెప్పటం మొదలు పెట్టాను. అదే భవిష్యత్ లో బంధువులు, స్నేహితులకు తరుణోపాయం చెప్పే గురవాయణం గా మారింది. ఈ విధంగా వివిధ సమస్యలకు నేను అందించే పరిష్కార మార్గాల్ని ఈ గురవాయణంలో మీరు చదువుతూ ఉండండి. నన్ను ఆశీర్వదిస్తూ ఉండండి. వేకువజామునే నిద్ర లేచి స్కూల్స్ కు పరిగెడుతున్న చిన్నారులకు మంచి చదువులు కలగాలని, వారి భవిష్యత్ బాగుండాలని కోరుకొంటూ సెలవు తీసుకొంటాను.

మీ గురవారెడ్డి,